Wednesday, April 22, 2020

అన్నీ నిజాలే... కానీ...

"ఏవోయ్.. మీ చెల్లి పెళ్ళి కుదిరితే ఎలాగూ వెళ్ళాలి కదా. మరీ పెళ్ళిచూపులకే వెళ్ళాలంటావా? ఈ సంబంధం కుదురుతుందో లేదో ఎవరికి తెలుసు?" ఇండియా వెళ్తానన్న పూజతో నసిగాడు అరుణ్. 

మౌనంగా ఊరుకుంది పూజ. తనలో తను మాత్రం అనుకుంది,"ఏదీ ఊహించేసుకోవద్దని తనకి చెప్పాలి, నేను చేసిన తప్పు తను చేయకూడదు" అని. 


ఒక వారం తర్వాత, ఫ్లయిట్లో తన సీట్లో కూర్చున్నాక గుర్తొచ్చింది పూజకి అరుణ్ చెప్పింది, "నువ్వు ఫ్లయిట్ ఎక్కి నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టాకే నేను ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి బయల్దేరుతా". పాపం వెయిట్ చేస్తున్నాడేమో అని వెంటనే మెసేజ్ పెట్టింది. కానీ ఆ గ్రే టిక్ లు బ్లూ కలర్ కి మారనే లేదు! ఫ్లయిట్ గాల్లోకి ఎగురుతుంటే తన ఆలోచనలు 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళాయి...


..........................................................................................


మ్యారేజ్ బ్యూరోలోనే అరుణ్ ఫోటో చూసి బాగున్నాడు అనుకుంది పూజ. పెద్దవాళ్ళకి కూడా అరుణ్ క్వాలిఫికేషన్, అమెరికాలో ఉద్యోగం, వాళ్ళ కుటుంబం అన్నీ నచ్చేశాయి. పెళ్ళిచూపులకి అరుణ్ వాళ్ళు వస్తున్నారు అంటే ఏం మాట్లాడాలి ఏం అడగాలి అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంది. 


ఆ రోజు రానే వచ్చింది. పేరుకి పెళ్ళిచూపులే గానీ అదేదో వాళ్ళ సన్మాన సభలాగా అమ్మాయి వినయవిధేయతల గురించి పూజ తల్లిదండ్రులు, అబ్బాయికి ఎన్ని గొప్ప సంబంధాలు వచ్చాయి అని అరుణ్ తల్లిదండ్రులు వంతుల వారీగా పోటీ పడి మార్కెటింగ్ చేసుకున్నారు. మధ్యవర్తి ఒక అనువైన సమయం చూసి "సరే" అనిపించేసాడు పెద్దోళ్ళందరితో. మొత్తం ప్రిపరేషన్ వేస్టయిపోయింది అని పూజ ఖంగారు పడుతున్న సమయంలో "అమ్మాయిని అబ్బాయిని కాస్త పక్కకెళ్ళి మాట్లాడుకోనివ్వండర్రా" అని బామ్మ చెప్తే అప్పుడు తట్టింది పెద్దోళ్ళకి! 

అరుణ్ పెద్దగా ఏం అడగలేదు. తనకి పూజ నచ్చేసింది. పూజ ప్రశ్నలన్నిటికీ వీలైనంత నిజాయితీగా సమాధానాలు ఇచ్చాడు...


"మీ హాబీస్, ఇష్టాయిష్టాలు వగైరా చెప్పండి"


"తప్పకుండా.. ముందే తెలుసుకోవడం మంచిది. నాకు ఇష్టమైనవి చాలా ఉన్నాయండీ.. ఎక్కువగా ఏదో ఒకటి చదువుతూ ఉంటా. నాకు స్పోర్ట్స్ కారుంది, దాని మీద డ్రయివ్ కి వెళ్ళడం చాలా ఎంజాయి చేస్తా. ఎప్పుడైనా అవసరమైతే వంట చేయడం కూడా ఇష్టమే. అలాగే ఫోటోలు తీయడం కూడా..."


"వావ్... ఇన్ని రకాల హాబీస్ ఉన్నాయంటే ఈయనతో లైఫ్ చాలా కలర్‌ఫుల్ గా ఉంటుంది!!" అనుకుంది పూజ. "మరి... మీ అలవాట్లు? అంటే.. సిగరెట్లు మందు వగైరా?"


"మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా... మరీ ఎక్కువ కాదు గానీ ఎప్పుడైనా వర్షం పడితే సరదాగా ఒక డ్రింక్ తీసుకుంటా. అలాగే ఒక్కోసారి ఏదన్నా పని ముందుకు కదలనప్పుడో లేకా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాల్సినప్పుడో ఒక దమ్ము కొడతా.. మరీ చైన్ స్మోకర్‌ని కాదు"  


"ఆ.. అలా ఎప్పుడో ఒకసారి తీసుకోవడంలో తప్పేముంది?" అనుకుంది. "చివరగా... మీకు ఇంతకుముందు ఏమన్నా ఎఫైర్స్ ఉన్నాయా?"


"ఎఫైర్స్ లాంటివి ఏమీ లేవండి.. కానీ నిజాయితీగా చెప్పేస్తున్నా. నేను అమ్మాయిలతో టైం గడపడం ఇష్టపడతా. నాకు అమ్మాయిల్లో ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు" 


"అంటే నా కంపెనీ కూడా ఇష్టపడతారన్నమాట" అనుకుంది. లోపలికి వెళ్ళంగానే సిగ్గుపడుతూ వాళ్ళమ్మానాన్నలకి తలాడించింది.


వాళ్ళు కలిసిన మూడు నెలల్లోనే పెళ్ళైపోయింది. అమెరికాలోని సియాటిల్ నగరంలో కాపురం పెట్టారు. తను అరుణ్‌తో ఊహించుకున్న కలలజీవితం నిజమవుతున్న ఆ క్షణం వచ్చేసరికి ఎంతో సంబరపడిపోయింది.

అరుణ్ పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ కొనాలా అని చాలా రోజులు ఆలోచించింది. గిఫ్ట్ వ్రాప్ చేసిన ఒక బాక్స్ ప్రెసెంట్ చేస్తే అంత బరువైన గిఫ్ట్ ఏమై ఉంటుందబ్బా అని కుతూహలంగా తెరిచి చూశాడు అరుణ్. షేక్‌స్పియర్, ఆయన్ రాండ్, మార్గరెట్ మిచ్చెల్ వంటి గొప్ప రచయితల పుస్తకాలు ఒక అరడజను చూసి ఖంగుతిన్నాడు. "వామ్మో, ఏంటివి? లైబ్రెరీలో ఉండాల్సినవన్నీ ఇంటికి తెచ్చావు?"

"అదేంటి అరుణ్, నువ్వు బాగా చదువుతా అన్నావ్ కదా.. అందుకే పుస్తకాలు ఇష్టపడతావనుకున్నా"

"ఇంకా నయం! నేనేదో న్యూస్ వెబ్సైట్లు, వాట్సాప్ జోకులు ఇలా ఎవో ఒకటి చదువుతూ ఉంటా. నీకు ఇలా పుస్తకాలు చదువుతానని అర్థమైందా?"

గాజు గ్లాసు భళ్ళున పగిలిన శబ్దం!!

ఒక ఆదివారం "అరుణ్, బద్ధకంగా ఉంది.. ఇవ్వాళ సరదాగా నాకోసం ఏమైనా వంట చేయొచ్చు కదా" మురిపెంగా అడిగింది పూజ. అడిగిందే తడువుగా "తప్పకుండా డియర్... " అంటూ ఒప్పుకుని కిచెన్లోకెళ్ళాడు. జాగ్రత్తగా ఒకటిన్నర కప్పుల బియ్యం తీసి అందులో మరింత జాగ్రత్తగా మూడు కప్పుల నీళ్ళు వేసి ఎలెక్ట్రిక్ కుక్కర్‌లో పెట్టి ఆన్ చేశాడు. ఒక అరగంట తర్వాత "పూజా, లంచ్ రెడీ" అని పిలిచాడు. ఆశగా వచ్చిన పూజ ఐటెమ్స్ ఎక్కడా అని చూస్తుంటే "పొడితో తింటావా, పచ్చడితోనా?" అడిగాడు.     

"ఏంటిది అరుణ్, మొదటి సారి నాకోసం వంట చేయమంటే వైట్ రైసా నువ్వు వండే వంట?"


"నాకిదే వచ్చు మరి"


"మరి ఆమాత్రం దానికి ఎదో పెద్ద కుక్‌లా వంట చేయడం ఇష్టమని ఎందుకు చెప్పావ్?"


"హేయ్, నేను నిజంగానే వంట చేయడం ఇష్టపడతా.. ఒక్క అరకప్పు నీళ్ళు అటు ఇటు ఐతే ఎలా ఉంటుంది రైస్?"



భూకంపం కనిపించింది !!

"అరుణ్.. ఈ లాంగ్ వీకెండ్ గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా. అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామా?"


"షూర్, పద వెళ్దాం". 


చాలా ఎక్సైట్ అయింది పూజ. చూస్తే సియాటెల్ నుంచి రెడ్‌మండ్‌కి తీసుకెళ్ళాడు - అంతా కలిపి అరగంట ప్రయాణం! 


"దీన్ని లాంగ్ డ్రైవ్ అంటారా? నీ కార్లో డ్రైవ్స్‌కి వెళ్ళడం ఇష్టమన్నావ్ ఇదేనా?" 


"మరి! మజా రాలేదూ?" ఏదో సాధించేసిన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు అరుణ్.



గుండెల్లో ఉరుముల శబ్దం పూజకి !!

"మంచి ఫోటోస్ తియ్యు అరుణ్, ఫేస్‌బుక్‌లో పెట్టాలి... ఫోటోస్ తీయడం ఇష్టం అన్నావుగా, చూద్దాం ఎంత బాగా తీస్తావో"


"మంచి పోస్ ఇవ్వు కుమ్మేద్దాం"


"పోస్ సరే, కెమేరా పట్టుకురా ముందు"


"ఉందిగా" అంటూ పాకెట్లోనుంచి పాత నోకియా ఫోన్ ఒకటి తీసాడు! "ఇదిగో.. నాకు ఫోటోస్ తీయడం ఇష్టం అన్నా.. తీసేది ఇష్టంగా తీస్తా అని, నువ్వేదో పెద్ద ఫోటోగ్రాఫర్‌ని అని ఊహించేసుకుంటే నా తప్పు కాదు చెప్తున్నా"



కుయ్య్‌మని చెవిలో ప్రెజర్ కుక్కర్ మోత మోగింది పూజకి 

"ఈమాత్రం దానికే తనకి చదవడం, వంట చేయడం, డ్రైవ్‌కి వెళ్ళడం వగైరా ఇష్టం అనుకుంటే... ఈ లెక్కన అమ్మాయిల కంపెనీ ఎంజాయ్ చేయడమంటే వాళ్ళని దూరం నుంచి చూసి ఆనందపడటమే అయ్యుంటుంది" అనుకుంది. కానీ ఈ విషయంలో మాత్రం తన అంచనాలని మించేశాడు... ఆఫీస్‌కి వెళ్ళడం అమ్మాయిలతోనే, అక్కడ ఉన్నంతసేపు కబుర్లు అమ్మాయిలతోనే, ఫోన్లో కబుర్లు వాళ్ళతోనే, ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అంతా వాళ్ళే! 


"అరుణ్, వంట ఏం చేయమంటావ్? బెండకాయ చేయనా దొండకాయ చెయనా?"


"ఆలోచించి చెప్తా" అంటూ సిగరెట్ వెలిగిస్తాడు 


"ఏ డ్రెస్ వేసుకోను? గ్రీనా పింకా?"


"ఆలోచించి చెప్తా".. మరో సిగరెట్


"టీ తాగుతావా కాఫీనా?"



"ఒక్క నిమిషం, ఆలోచించి చెప్తా"...ఇంకో సిగరెట్!

అలాగే సియాటెల్ నగరంలో ఇంచుమించు ప్రతి రోజూ వర్షం పడుతుందని, ఆ లెక్కన మనోడు ప్రతి రోజు డ్రింక్ చేస్తాడని అర్థమవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు తనకి. 

అగ్నిగుండం బద్దలయింది.. గొడవకి దిగింది. "నువ్వు నాకు చెప్పిందేంటి చేస్తున్నదేంటి?" 

"పూజా.. నేను అన్నీ నిజాలే చెప్పాను. నువ్వు ఎక్కువ ఊహించేసుకుంటే నాదా తప్పు?" అడిగాడు అరుణ్!
.......................................................................................

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పూజని రిసీవ్ చేసుకుంది తన చెల్లెలు శ్రద్ధ. 

"అక్కా.. హమ్మయ్య నువ్వొచ్చేసావ్! ఏమైందో తెలుసా? గౌతం వాళ్ళ ప్లాన్ మారి నిన్ననే పెళ్ళిచూపులకి వచ్చేశారు!"

"అవునా! అబ్బాయితో మాట్లాడావా? ఏం మాట్లాడావ్? ఎలా అనిపించాడు?" ఖంగారుగా అడిగింది పూజ



"సూపర్ కూల్ అక్కా తను.. చూడ్డానికి బాగున్నాడు. చాలా రకాల హాబీస్ ఉన్నాయి తనకి... పెయింటింగ్, సంగీతం, వంట, ఫోటోగ్రఫీ.. లైఫ్ చాలా కలర్‌ఫుల్ గా ఉంటుంది అనిపించింది"

పూజ నడుస్తున్నదల్లా ఆగిపోయింది . "మందు సిగరెట్?"



"ఎప్పుడో ఒకసారి అంట.. వర్షం పడినప్పుడో, బాగా ఆలోచించాల్సినప్పుడో"

...........................................XXX........................................


No comments:

Post a Comment